భక్తుల గాథలు
షిరిడీ నుండి తీసుకువచ్చిన పవిత్రమైన కిటికీలు
అసలైన ద్వారకామాయితో ముడిపడిన దైవిక అనుబంధం
2000వ సంవత్సరం తర్వాత షిరిడి సాయిబాబా సంస్థాన్ మరియు ఆ పరిసర ప్రాంతాలు ఊహించని రీతిలో అభివృద్ధి చెందాయి. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో, సంస్థాన్ ట్రస్ట్ మరియు ప్రభుత్వం కలిసి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అనేక చర్యలు చేపట్టాయి.
ఆలయ పునరుద్ధరణ పనుల సమయంలో, ద్వారకామయిలో బాబా స్వయంగా స్పృశించిన కొన్ని కిటికీలు స్వల్పంగా దెబ్బతినడంతో, వాటిని తొలగించి భద్రత కోసం గోడౌన్‌కు తరలించారు. సరిగ్గా అదే సమయంలో, హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో "ముక్తిధామం" సాయిబాబా ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. బాబా స్పృశించిన ఏదైనా ఒక వస్తువు తమ ఆలయ నిర్మాణంలో భాగమైతే బాగుంటుందని భావించిన ముక్తిధామం నిర్వాహకులు షిరిడికి వెళ్లారు.
కిటికీల గుర్తింపు
అక్కడ అధికారులతో చర్చిస్తూ పర్యటిస్తున్న క్రమంలో, గోడౌన్‌లో ఉన్న ఆ పాత కిటికీలు వారి కంటపడ్డాయి. ఫ్రేమ్ స్వల్పంగా విరిగిపోయిన ఆ కిటికీలను తాము బాగు చేయించుకుని, తమ ఆలయంలో వాడుకుంటామని నిర్వాహకులలో ఒకరైన గౌతమ్ గారు అధికారులతో మాట్లాడారు. అధికారులు కోరిన విధంగా 11,000 రూపాయలు చెల్లించి, రెండు రోజుల్లో ఆ కిటికీలను వాహనంలో హైదరాబాద్ పంపవలసిందిగా కోరి వారు తిరిగి వచ్చారు.
అవాంతరం
నిర్ణీత సమయం గడిచినా కిటికీలు రాకపోవడంతో, నిర్వాహకులు షిరిడి ఆలయ ఈఓ (EO) ని సంప్రదించారు. దానికి ఆయన స్పందిస్తూ.. "మీరు వెళ్లిన మరుసటి రోజే ముంబైకి చెందిన ఒక పెద్ద వ్యాపారవేత్త ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా బాబాకు పరమ భక్తుడు. తను నిర్మిస్తున్న వ్యాపార గోడౌన్‌లో బాబాకు సంబంధించిన వస్తువు ఏదైనా ఉండాలని కోరుతూ, ఈ కిటికీల కోసం పది లక్షల రూపాయలు చెల్లించారు. అంత పెద్ద మొత్తం ఆలయ అభివృద్ధికి ఉపయోగపడుతుందని భావించి, ఆ కిటికీలను ఆయనకే ఇవ్వాలని నిర్ణయించాము. మీకు కావాలంటే బాబాకు సంబంధించిన మరేదైనా వస్తువును తీసుకెళ్లండి" అని వివరించారు. దానికి ముక్తిధామం ప్రతినిధులు, "మేము అంతకంటే ఎక్కువ ఇస్తాము, కానీ మాకు ఆ కిటికీలే కావాలి" అని కోరగా.. అధికారులు ట్రస్ట్ సభ్యులతో చర్చించి చెబుతామన్నారు.
బాబా లీల
ఒక గురువారం రాత్రి, ముంబై వ్యాపారవేత్త కలలోకి బాబా వచ్చి.. "నా ఆలయానికి ఉపయోగపడాల్సిన కిటికీలను తీసుకెళ్లి, నీ వ్యాపార గోడౌన్‌లో బంధిస్తావా? ఇది తప్పు కదా!" అని గద్దించారు. ఉలిక్కిపడి మేల్కొన్న ఆ వ్యాపారవేత్త వెంటనే షిరిడికి ఫోన్ చేసి, "నాకంటే ముందు ఈ కిటికీల కోసం ఎవరైనా వచ్చారా?" అని ఆరా తీశారు. అధికారులు హైదరాబాద్ ఆలయం గురించి వివరించగా.. ఆయన వెంటనే, "నేను ఇచ్చిన పది లక్షలను విరాళంగా జమ చేయండి, కానీ ఆ కిటికీలను వెంటనే హైదరాబాద్ పంపండి. అవి అక్కడ నిర్మిస్తున్న బాబా ఆలయానికే చేరాలని స్వయంగా బాబా నా కలలోకి వచ్చి చెప్పారు" అని తెలిపారు. ఈ అద్భుతానికి అధికారులు నివ్వెరపోయారు.
ముగింపు
అలా బాబా సంకల్పంతో ఆ కిటికీలు హైదరాబాద్ చేరుకున్నాయి. పోలంకికి చెందిన నిపుణులైన వడ్రంగులతో వాటిని బాగు చేయించి, ప్రస్తుతం ఉన్న ప్రధాన గర్భాలయ నిర్మాణంలో భాగంగా అమర్చారు. దీనివల్ల ఇక్కడి భక్తులకు అసలైన ద్వారకామయితో ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది. బాబా స్వయంగా స్పృశించిన ఆ కిటికీల సాక్షిగా, ఈ ఆలయం నేడు వేలాది మంది భక్తుల విశ్వాసానికి నిలయంగా వెలుగొందుతోంది.
శంకుస్థాపన
దేవాలయ శంకుస్థాపన సమయంలో కనిపించిన దైవిక సంకేతాలు
ఈ పవిత్ర ఆలయ ఆవిర్భావానికి ఆద్యం పోస్తూ, ఆలయ శంకుస్థాపన సమయంలో చోటుచేసుకున్న ఆశ్చర్యకరమైన ఘట్టాలు మరియు దైవిక సంకేతాల సమాహారం.
ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేస్తూ భూమి పూజ నిర్వహిస్తున్నా రోజు అది. సరిగ్గా శంకుస్థాపన జరుగుతున్న సమయంలో, ఒక వ్యక్తి హఠాత్తుగా పరుగున వచ్చి ఆలయ నిర్వాహకుల కాళ్ళ మీద పడ్డాడు. కన్నీళ్లతో తనను క్షమించమని వేడుకుంటూ, తన వెంట తెచ్చిన డబ్బును అక్కడ పెట్టాడు.
అక్కడున్నవాళ్ళు అందరూ ఆశ్చర్యపోయి, "ఏమైంది బాబు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నావు?" అని అడిగితే —
అతడు తడబడుతున్న స్వరంతో: "అయ్యా, కొన్ని రోజుల క్రితం ఆలయ పునాది కోసం ఇటుకలు, ఇసుక తెప్పించారు కదా వాటిని పంపింది నేనే. నేను పంపింది 9000 ఇటుకలు కానీ ప్రతి ఇటుకను ఒక్కోక్కటిగా లెక్కించడం సాధ్యం కాదని, అడ్డం నిలువు వరసలలో ఇన్ని ఇటుకలు పెట్టామని చెప్పి మధ్యలో డొల్ల ఉంచి మొత్తం 14,000 ఇటుకలకు డబ్బు తీసుకున్నాను.
కొంచెం ఆగి, కళ్లు తుడుచుకుంటూ, "నిన్న రాత్రి బాబా నా కలలోకి వచ్చి... 'నా గుడి కట్టే ఇటుకల విషయంలో మోసం చేస్తావా? ఇది తప్పు కదా!' అని గద్దించారు. ఆ మాటలతో నా కళ్లు తెరుచుకున్నాయి. తెల్లవారితే శంకుస్థాపన అని తెలిసి, చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఆ మిగిలిన డబ్బును తిరిగి ఇచ్చేయడానికి వచ్చాను."
నన్ను క్షమించండి అని వెళ్ళిపోయాడు.
అతని మాటలు విన్న భక్తులందరూ బాబా మహిమను తలచుకుని పులకించిపోయారు.